'సింగం ఎగైన్'.. వెండితెరపై మరో రామాయణం!
on Oct 7, 2024
బాలీవుడ్ లో డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా రూపొందే 'సింగం' సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ సిరీస్ నుంచి 'సింగం', 'సింగం రిటర్న్స్' రాగా.. రెండు ఘన విజయం సాధించాయి. హీరోగా అజయ్ దేవ్‌గణ్ కి మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించాయి. ఇప్పుడు వీరి కలయికలో 'సింగం ఎగైన్' వస్తోంది. నవంబర్ 1న థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. (Singham Again Trailer)
ఇటీవల పలు సినిమాల్లో మైథలాజికల్ టచ్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు 'సింగం ఎగైన్' లాంటి కమర్షియల్ సినిమాలోనూ మైథలాజికల్ టచ్ ఉండటం విశేషం. రామాయణానికి ముడిపెడుతూ 'సింగం ఎగైన్' కథని నడిపించాడు దర్శకుడు రోహిత్ శెట్టి. రాముడిలా అజయ్ దేవ్‌గణ్, సీతలా కరీనా కపూర్, లక్ష్మణుడిలా టైగర్ ష్రాఫ్, హనుమంతుడిలా రణవీర్ సింగ్, జటాయువులా అక్షయ్ కుమార్, రావణుడిలా అర్జున్ కపూర్ పాత్రలను చూపించారు. సీతను రావణుడు అపహరించడం, రావణుడి మీద చేసే పోరాటంలో రాముడికి అండగా లక్ష్మణుడు, హనుమంతుడు, జటాయువు నిలబడటం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో చూడవచ్చు. ఒక కాప్ యాక్షన్ ఫిల్మ్ ని ఇలా రామాయణం రిఫరెన్స్ తో రూపొందించడం కొత్తగా ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన 'ఆదిపురుష్' విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఐదు నిమిషాల ఒక కమర్షియల్ మూవీ ట్రైలర్ లో డైరెక్టర్ రోహిత్ శెట్టి చూపించిన రామమయం రిఫరెన్స్ లు ప్రశంసలు అందుకుంటున్నాయి.
'సింగం ఎగైన్'లో భారీ తారాగణం ఉంది. అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఇలా ఎందరో నటించారు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరవనున్నాడని సమాచారం.
Also Read